కథానాయికగా ఎంట్రీ ఇచ్చి.. నిర్మాతగా ఎదిగి.. దర్శకురాలైన వారు ఇండస్ట్రీ లో చాలా అరుదు.  భానుమతి రామకృష్ణ, విజయనిర్మలకు మాత్రమే అది సాధ్యమైంది. ఆ తర్వాత కాలంలో వారిని అనుసరించిన నటీమణి ఒక్క జీవితా రాజశేఖర్ మాత్రమే. తమిళనాట కథానాయికగా ప్రవేశించిన ఆవిడ..  ఆ తర్వాత తెలుగు, కన్నడ భాషల్లో సైతం నటించి మెప్పించారు. దాదాపు 15 తెలుగు చిత్రాల్లో కథానాయికగా నటించిన జీవిత.. హీరో రాజశేఖర్ ను పెళ్ళి చేసుకున్నాకా.. పూర్తిగా నటనా రంగానికి గుడ్ బై చెప్పేశారు. జీవిత తెలుగులో నటించిన ఆఖరి చిత్రం ‘అంకుశం’. ఆ సినిమా సూపర్ హిట్టయినా సరే.. జీవిత మళ్ళీ తెలుగు తెరమీద కనిపించలేదు.

జీవిత అసలు పేరు పద్మ. ఆమె శ్రీశైలానికి చెందిన హెల్త్ ఇన్స్ పెక్టర్ రామనాథంగారి అమ్మాయి . తల్లి శకుంతల. అక్క, అన్న, చెల్లెలు ఉన్నారు. జీవిత తాతగారు.. యన్టీఆర్ అకౌంటెంట్ గా పనిచేసేవారు. ఉద్యోగంలో భాగంగా.. ఆయన కుటుంబం చెన్నైకి షిఫ్ట్ అయింది. అప్పుడు జీవితకు తొలిసారిగా తమిళ చిత్రాల్లో కథానాయికగా నటించే అవకాశమొచ్చింది. టి.రాజేందర్ దర్శకత్వం వహించిన ఉరవై కార్తకిళి సినిమాతో జీవిత హీరోయిన్ అయింది. తెలుగులో ఆమె మొదటి సినిమా ‘డామిట్ కథ అడ్డం తిరిగింది’. ఆ తర్వాత తలంబ్రాలు సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. ఇక జీవిత ‘శేషు, ఎవడైతే నాకేంటి, సత్యమేవ జయతే,  మహంకాళి’ లాంటి సినిమాలకు దర్శకత్వం వహించారు. అందులో మూడు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. ప్రస్తుతం తన కూతుళ్ళు శివానీ, శివాత్మిక లను మంచి హీరోయిన్స్ గా తీర్చిదిద్దే ప్రయత్నంలో ఉన్నారు జీవిత. నేడు జీవిత పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.

 

 

Leave a comment

error: Content is protected !!