పాత్రని బట్టి.. సినిమాను ఎంపికచేసుకోవడం .. తన కెపాసిటీని బట్టి.. పాత్రను సెలెక్ట్ చేసుకోవడం పూర్వం నుంచే ఉంది. అగ్ర కథానాయకులు ఒక పట్టాన తన పాత్ర బాగుంటేనే , ఆ పాత్ర తన ఇమేజ్ ను పెంచుతుంది అనుకుంటేనే సినిమాలు చేసేవారు. ఈ విషయంలో యన్టీఆర్ చాలా పర్టిక్యులర్ గా ఉండేవారు. చిన్న పాత్రైనా.. అందులో వెయిట్ ఉండాలి. అది తనకి పేరు తేవాలని తపించేవారు ఆయన. అందుకే కొన్ని సినిమాల్ని ఆయన వదులుకున్న సందర్భాలున్నాయి.

పి.పుల్లయ్య 1955లో ‘అర్థాంగి’ తీశారు. ‘స్వయంసిద్ధ’ అనే బెంగాలి నవల ఆధారం. ఈ నవలను మద్దిపట్ల సూరి ‘ఆంధ్రపత్రిక’లో సీరియల్‌గా అనువదించారు. తెలుగు చిత్రం అఖండ విజయం పొందింది. అయితే, ముందుగా పుల్లయ్య ఆ సినిమాలో అన్నదమ్ముల వేషాలకి ఎన్‌.టి.రామారావు, అక్కినేని అనుకున్నారు. ఎన్‌టి.ఆర్‌కి కథ వివరించి, వేషం సంగతి చెప్పారుట కూడా! కానీ, అక్కినేని తమ్ముడి వేషం తాను చెయ్యనని, ఇస్తే అన్న వేషం ఇమ్మనీ అడిగారు. తర్జనభర్జనల తరువాత, నాగేశ్వరరావు అన్న వేషం వెయ్యగా, తమ్ముడి వేషం జగ్గయ్య వేశారు. తారాగణంలో మార్పులు జరిగినట్టు పుల్లయ్య ఎన్‌.టి.ఆర్‌తో చెప్తే ‘‘బాగుంది. అదే రైటు’’ అన్నారుట. విశేషమేంటంటే.. ఇదే కథని ఆ తర్వాత కాలంలో .. కొద్దిపాటి మార్పులతో  కె.భాగ్యరాజ్ ఎంగ చిన్నరాజా గా  తమిళంలో తీస్తే సూపర్ హిట్టయింది. అప్పట్లో అది తెలుగులో చిన్నరాజా గా అనువాదమైంది. ఆ తర్వాత అదే సినిమాను ఇ.వి.వి సత్యనారాయణ తెలుగులో వెంకటేశ్ తో అబ్బాయిగారు గా రీమేక్ చేశారు.

Leave a comment

error: Content is protected !!