అల్పాక్షరముల అనల్పార్ధ రచన అతడి శైలి. అలతి అలతి పదాలతో అందమైన భావుకతను పాటకి అలంకరించడం అతడికి పెన్నుతో పెట్టిన విద్య. సందర్భానికి తగ్గరీతిలో .. సన్నివేశానికి నప్పే శైలిలో అతడు కట్టే పాట .. బాణీకే భావాల వోణిని కట్టడం అతడి టాలెంట్ . అతి చిన్న వయసులోనే అతి పెద్ద భావకుడిగా అవతరించిన అతడి తీరు నిజంగా ప్రశంసనీయం. అతడి పేరు అనంత శ్రీరామ్. నిజంగానే ఆ శ్రీరాముడు అనంతమైన భావాల అభిరాముడు. తెలుగు తెరపై లెక్కకు మించిన పాటలతో .. ప్రతిభావంతులైన ఎందరో గీతకారుల సరసన ఉన్నతమైన స్థానాన్ని సంపాదించుకొన్న ఆ అనంతుడు. 12 ఏళ్ల వయసులోనే తాను చూసిన…స్ఫూర్తిని పొందిన అనేకానేక అంశాలపై పాటలు కట్టడం… మురిసిపోవడం… మళ్ళీ మళ్ళీ ఆ ఇష్ట వ్యాపకంతో మునిగి తేలడం…అలవాటుగా పరిణమించి…ఆ పై ఆ ప్రవృత్తే వృత్తిగా మారడం అనంత శ్రీరామ్ కు అందిన వరం. కాదంటే ఔననిలే… అన్న సినిమాకి పాటలు రాయడం ద్వారా అనంత శ్రీరామ్ తెలుగు సినిమాకి పరిచయమయ్యారు. చిరంజీవి అందరివాడు సినిమాకి అనంత శ్రీరామ్ రాసిన యుగళం జనబాహుళ్యంలోకి యిట్టె వెళ్ళిపోయింది. ఓ పడుచు బంగారమా…పలుకవే సరిగమ… చిలిపి శృంగారమా…చిలకవే మధురిమ …అన్న పాటతో ఆయన పాటల ప్రస్థానం విజయాల మజిలీలను దాటుకుంటూ శరవేగంగా సాగిపోయింది. ఆ తర్వాత ఏమండోయ్…శ్రీవారు, బొమ్మరిల్లు చిత్రాల్లోని పాటలకు కూడా మంచి పేరు వచ్చింది. అపుడో…ఇపుడో… కలగన్నానే చెలి… అక్కడో..ఇక్కడో…ఎక్కడో మానసిచ్చానే గో…గో…గోవా…, తోబరే తోబా, పరారే పరారే లాంటి పాటలు అతడికి మంచి పేరు తెచ్చిపెట్టాయి. అక్కడి నుంచి మున్నా, మహారథి, శౌర్యం, బలాదూర్, ఉల్లాసంగా…ఉత్సాహంగా, ద్రోణ, పరుగు, కంత్రి, ఆకాశ రామన్న, ఇంకోసారి, కుర్రాడు, శశిరేఖ పరిణయం, సత్యమేవ జయతే, అరుంధతి, డార్లింగ్, శుభప్రదం, మిరపకాయ్, బృందావనం, ఊసరవెల్లి, మిస్టర్ పర్ఫెక్ట్, ప్రేమ కావాలి, అలా మొదలైనది, దడ, నాన్న నుంచి తాజాగా గీత గోవిందం, అర్జున్ రెడ్డి, సాహసమే శ్వాసగా సాగిపో…ఇలా ఎన్నో విజయవంతమైన చిత్రాలకు పాటలు రాశారు. ఆయన రాసిన ప్రతి పాట ప్రేక్షకుల గుండెని హత్తుకుంటుంది. ఇక బాహుబలిలో ఆయన రాసిన పాత పచ్చబొట్టేసిన పిల్లగాడా…నీతో పచ్చి ప్రాయాలనే పంచుకుంటానురా! అన్న పాట చిత్రీకరణ కూడా పాటకు తగ్గట్టే ఎంతో అందంగా ఉంది.
అనంత శ్రీరామ్ పాటలకు జనామోదం లభించడమే కాకుండా వివిధ సాంస్కృతిక సంస్థల నుంచి అవార్డులు, పురస్కారాలు లెక్కకు మిక్కిలి లభించాయి. 2012లో ఏటో వెళ్ళిపోయింది మనసు చిత్రానికి రాసిన పాటలకు ఉత్తమ గీత రచయిత గా నంది అవార్డుతో పాటు ఫిలిం ఫేర్ అవార్డు కూడా దక్కింది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాకి రాసిన పాటలకు గాను 2014లో సైమా ద్వారా ఉత్తమ గీత రచయిత పురస్కారాన్ని అందుకున్నారు. నేడు అనంత శ్రీరామ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆ గీతకారుడికి శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.
హ్యాపీ బర్త్ డే అనంత శ్రీరామ్