అందమైన ముఖం.. ఆకట్టుకొనే కళ్ళు.. చిరునవ్వులు చిగురించే పెదాలు.. ఆకట్టుకొనే అభినయం.. ఆమె ఆభరణాలు. పేరు అమల. అక్కినేని నాగార్జున మనుసు దోచి, ఆయన్నే మనువాడిన మగువ. తండ్రి బెంగాలీ నేవీ అధికారి. తల్లి ఐరిష్ జాతీయురాలు. భరతనాట్యంలో డిగ్రీ పట్టా అందుకొన్న అమల, అనుకోకుండా ప్రముఖ దర్శకుడు టి.రాజేందర్ దృష్టిలో పడి… ఆయన ప్రోద్భలంతోనే సినీ రంగ ప్రవేశం చేశారు. తమిళంలో నటించిన తొలి చిత్రం ‘మైథిలి ఎన్ కాథలి’ ఘన విజయం సాధించింది. ఆ తర్వాత వరుసగా ఆమెకి అవకాశాలు వెల్లువెత్తాయి. తమిళంతో పాటు, తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో నటించే అవకాశాలు అందుకొన్నారు.
నాగార్జునతో కలిసి తెలుగులో ‘కిరాయి దాదా’, ‘చినబాబు’, ‘శివ’, ‘ప్రేమ యుద్ధం’, ‘నిర్ణయం’ తదితర చిత్రాల్లో నటించి మంచి జోడీగా ప్రేక్షకుల మనసు దోచుకొన్నారు. సినీ ప్రయాణంలోనే ఇద్దరి మనసులు కలిశాయి. ఆ తర్వాత పెళ్లి చేసుకొన్నారు. పెళ్లి తర్వాత సినిమాలకి దూరమైన అమల మళ్లీ 2012లో ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ చిత్రంతో అమ్మ పాత్రలో నటించి ప్రేక్షకులతో కంట తడి పెట్టించారు. ఆ తర్వాత ‘మనం’లోనూ ఓ చిన్న పాత్రలో మెరిశారు. హిందీ, మలయాళం భాషల్లోనూ సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా సినిమాలు చేశారు. నాగార్జున, అమలకి జన్మించిన అఖిల్ అక్కినేని ప్రస్తుతం కథానాయకుడిగా కొనసాగుతున్నారు. జంతు ప్రేమికురాలైన అమల బ్లూ క్రాస్ ఆఫ్ హైదరాబాద్ అనే స్వచ్ఛంద సేవా సంస్థని నెలకొల్పారు. జంతు సేవా, సంరక్షణ కార్యక్రమాల్ని చేపడుతున్నారు. నేడు అమల పుట్టినరోజు . ఈ సందర్భంగా ఆమెకి శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.