ఆమె రాగం రమణీయం.. గానం కమనీయం.. స్వరం.. స్వర్ణ మయం.. గాత్రం కర్ణోపేయం. శ్రుతి పక్వమైన , స్వర శుద్ధమైన ఆమె పాటకి ఎవరైనా పరవశించాల్సిందే. పేరు స్వర్ణలత. తెలుగు సినీ సంగీతానికి ఆమె పాటతో పెనవేసుకొన్న స్వరలత. ఈమె సుమారు 7000 పాటలు తమిళం, కన్నడం, తెలుగు, హిందీ, మలయాళం, ఉర్దూ, బెంగాలీ, ఒరియా, పంజాబీ, బాడిగ భాషలలో పాడి ప్రేక్షకుల మన్ననలను, ఎన్నో పురస్కారాలు పొందారు. ఈమెకు కరుత్తమ్మ సినిమాలో పొరలె పొన్నుతాయి అనే పాటకు జాతీయ ఉత్తమ గాయని పురస్కారం లభించింది. ఈ పాటను ఏ.ఆర్.రెహమాన్ సంగీత దర్శకత్వం వహించారు.. ఈమె గాత్రం విలక్షణంగాఉండటం వలన సంగీత ప్రపంచంలో నిలిచిపోయారు.
స్వర్ణలత కేరళ రాష్ట్రంలో పలక్కాడ్ లోని చిత్తూర్ గ్రామంలో జన్మించింది. ఈమె తల్లితండ్రులు కె.సి.చెరుకుట్టి, కళ్యాణి. ఈమె తండ్రి హార్మోనియం వాద్యంలో నిపుణులు, మంచి గాయకుడు.. ఈమె తల్లికి సంగీతం మీది శ్రద్ధ వలన స్వర్ణలతకు హార్మోనియం, కీ-బోర్డులో శిక్షణ ఇప్పించారు. ఈమెకు గల సంగీతాభిమానం చూచి ఎం.ఎస్. విశ్వనాథన్ ఈమెను జేసుదాసుతో కలిపి యుగళగీతం మలయాళం భాష 1987లో పాడే అవకాశం ఇచ్చారు.
సిసింద్రీలో చిన్నితండ్రి, ఒసేయ్ రాములమ్మలో ఓ ముత్యాల కొమ్మ, దౌడ్ లో షబ్బా షబ్బా, భారతీయుడులో అదిరేటి డ్రెస్సు మీరేస్తే, బోంబే లో కుచ్చి కుచ్చి కూనమ్మ, స్వయం వరంలో కీరవాణి రాగంలో , రంగీలా లో హాయిరామా, దళపతిలో యమునా తటిలో.. లాంటి సూపర్ హిట్ గీతాల్ని స్వర్ణలత గొంతులోంచే జాలువారాయి. నేడు స్వర్ణలత వర్ధంతి. ఈ సందర్భంగా ఆమెకు ఘననివాళులర్పిస్తోంది మూవీ వాల్యూమ్ .