నటభూషణ శోభన్ బాబు నటించిన కుటుంబ కథా చిత్రాలు ఏ స్థాయిలో విజయ వంతమయ్యాయో తెలిసిందే. అందులో సంసారం సినిమా ఒకటి. 1988 లో విడుదలైన ఈ సినిమా ఘన విజయం సాధించింది. యస్.ఆర్.ఫిల్మ్స్ పతాకంపై శాఖమూరి రామచంద్రరావు నిర్మించిన ఈ సినిమాకు రేలంగి నరసింహారావు దర్శకుడు. శారద, జయప్రద శోభన్ బాబుకి జోడీగా నటిస్తే… రాజేంద్ర ప్రసాద్ , రజనీ మరో జోడీగా నటించారు. ఇంకా.. గొల్లపూడి మారుతీరావు, సుధాకర్, ప్రసాద్ బాబు, సాక్షిరంగారావు, రాజ్యలక్ష్మీ, వరలక్ష్మి ఇతర ముఖ్యపాత్రలు పోషించారు.  రాజ్ కోటి సంగీత సారధ్యంలోని పాటలు ఆకట్టుకుంటాయి. అందులో కొమ్మలో కోయిల సరిగమలు పాట.. ఇప్పటికీ సంగీత ప్రియుల్ని వెంటాడుతూనే ఉంటుంది.

రాజశేఖరం (శోభన్ బాబు) క్రమశిక్షణకు ప్రాణమిచ్చే వ్యక్తి. భార్య లక్ష్మి (శారద), ముగ్గురు పిల్లలతో సంతోషంగా జీవితాన్ని గడుపుతూంటాడు. ఆయన పెద్ద కొడుకు హరి (హరి ప్రసాద్), కూతురు  రాధ (వరలక్ష్మి) అతని మార్గంలో నడుస్తారు. రెండవ కొడుకు రవి (రాజేంద్ర ప్రసాద్) మాత్రం తన తండ్రి ఫ్యాక్టరీలో  కార్మికుడుగా పనిచేస్తూంటాడు. అతను అనాథ అమ్మాయి గౌరి (రజని) ని ప్రేమిస్తాడు. వారి శ్రేయోభిలాషి గోపాలం (గొల్లపూడి మారుతీరావు) సహాయంతో, రవి ఆమెను తనింట్లో పనిమనిషిగా ప్రవేశపెడతాడు.  రాజశేఖరం రాధకు..  కుమార్ (సుధాకర్) అనే బాగా చదువుకున్న వ్యక్తితో పెళ్ళి చేస్తాడు. ఆ సమయంలో, రాజశేఖరం రవి ప్రేమ వ్యవహారాన్ని గ్రహించి, అతన్ని ఇంటి నుండి వెళ్ళగొడతాడు. కొన్నాళ్ళకు, రాజశేఖరం కర్మాగారంలో కార్మిక వివాదాలు తలెత్తుతాయి. యూనియన్ నాయకుడు శేషగిరి (ప్రసాద్ బాబు) రవిని మధ్యలో లాగి తండ్రీ కొడుకుల మధ్య వైరం సృష్టిస్తాడు. దాంతో  రాజశేఖరం తన పెద్ద కొడుకు హరి వద్దకు వెళ్తాడు. కాని అతను పట్టించుకోకపోవడంతో, రాజశేఖరం తిరిగి వచ్చేస్తాడు. ఆ సమయానికి, కుమార్ అతని ఇంటిని ఆక్రమించి, అతనిని బయటికి తోసేస్తాడు. ఆ సమయంలో, రవి అతడికి రక్షణగా వస్తాడు. రాజశేఖరం అతడి గుణాన్ని అర్థం చేసుకుంటాడు. చివరగా, రాజశేఖరం రవి గౌరీలతో సంతోషంగా ఉండగా ఈ చిత్రం ముగుస్తుంది. నిజానికి ఈ సినిమా ‘ఒరు పైంగిళి’ కథ అనే మలయాళ మూవీకి రీమేక్ వెర్షన్. ఆ తర్వాత అదే సినిమా తమిళంలో ‘తాయికొరు తాళాట్టు’గా రీమేక్ అయింది. ఈ రెండు సినిమాలూ ఆయా భాషల్లో సూపర్ హిట్టయ్యాయి.

Leave a comment

error: Content is protected !!