ఎంత గొప్ప సినిమాలైనా కొన్ని సార్లు అవి విడుదలకు నోచుకోవు. అలాగే ఒక భాషలో హిట్టైన సినిమాల్ని వేరే భాషలోకి డబ్బింగ్ అయ్యే క్రమంలో కూడా కొన్ని సినిమాలు విడుదలకు నోచుకోకపోవడం కూడా అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది. దీనికి ప్రత్యక్ష నిదర్శనం షావుకారు జానకి తమిళంలో నిర్మించిన సినిమానే.
కొన్ని ఏళ్ల క్రితం హిందీలో ‘మమత’ అనే చిత్రం వచ్చింది. ఇందులో సుచిత్రసేన్ రెండు పాత్రలు ధరించింది. తల్లిగానూ, కూతురుగానూ. ఆమె ద్విపాత్రధారణ అద్వితీయంగా ఉన్నదన్న ప్రశంసలు పొందింది. సినిమా విజయ సాధన చేసింది. ఆ పాత్రకి ముగ్దురాలై, షావుకారు జానకి – ‘మమత’ హక్కులు కొని, తమిళంలో తానే చిత్రం నిర్మించి, తళ్లీకూతుళ్ల పాత్రలు ధరించింది. ఇది కూడా విజయం సాధించింది. షావుకారు జానకి, తెలుగులోకి ఆ చిత్రాన్ని డబ్ చేసింది. అంతా పూర్తయింది కాని, విడుదలకు నోచుకోలేదు. కారణం – ‘మమత’ చిత్ర నిర్మాతల అభ్యంతరాలు, డిమాండ్లూ. దాంతో ఆ చిత్రం చూసే అవకాశం తెలుగువారికి దక్కలేదు.