ఆరడుగుల ఆజానుబాహుడు.. అందుకు తగ్గ దేహ దారుడ్యం..  ఆకర్షించే కళ్ళు.. ఆకట్టుకొనే చిరునవ్వు.. కట్టి పడేసే అభినయం.. అందుకు తగ్గ ఆంగికం.. ఏ పాత్రనైనా అవలీలగా పోషించగలిగే ప్రతిభ.. ఏ సన్నివేశాన్నైనా రక్తికట్టించ గలిగే సత్తా ఆయన సొంతం. పేరు సత్యరాజ్. స్వచ్ఛమైన తమిళుడు. పెరియార్ రామసామి శిష్యుడు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో  ఇంతవరకూ  200పైగానే చిత్రాల్లో నటించి మెప్పించారు ఆయన. బాహుబలి లో కట్టప్ప పాత్ర తో అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్నారు.

సత్యరాజ్ కు సినిమాల మీద ఆసక్తి ఉన్నా ఆయన  తల్లి ఆ రంగంలో ప్రవేశించడానికి అంగీకరించలేదు. అయినా సరే 1976 లో సినీరంగంలో ప్రవేశించడం కోసం కోయంబత్తూరు వదిలి చెన్నైలోని కోడంబాక్కం చేరారు .అవకాశాల కోసం చెన్నై చేరిన ఆయనకు పెదనాన్న కొడుకైన శివ సహాయం చేశాడు. అక్కడే ఒక గది అద్దెకు తీసుకుని అవకాశాల కోసం ప్రయత్నించసాగాడు. అణ్ణక్కిళి  అనే సినిమా చిత్రీకరిస్తుండగా ఆయనకు నటుడు శివకుమార్, నిర్మాత తిరుప్పూర్ మణియన్ లతో పరిచయం అయింది. కోమల్ స్వామినాధన్ డ్రామా బృందంలో చేరారు. నటుడిగా ఆయన మొట్టమొదటి సినిమా ‘సట్టమ్ ఎన్ కైయిల్’, 1978 లో వచ్చిన ఈ సినిమాలో సత్యరాజ్ ప్రధాన ప్రతినాయకుడైన తెంగై శ్రీనివాసన్ కి అనుచరుడిగా నటించాడు. తరువాత ‘కన్నణ్ ఒరు కైక్కుళందై’ అనే సినిమాకు ప్రొడక్షన్ మేనేజర్ గా పనిచేశాడు. అందులోనే మరో చిన్న పాత్ర కూడా పోషించాడు. కథానాయకుడిగా ఆయన మొదటి సినిమా 1985 లో వచ్చిన సావి, ఈ సినిమా బాక్సాఫీసు వద్ద విజయం సాధించింది. అందులో సత్యరాజ్ ది నెగటివ్ పాత్ర. 1978 నుండి 1985 వరకు ఏకంగా 75 సినిమాల్లో నటించారు. వీటిలో చాలా వరకు ప్రతినాయక పాత్రలే. ఇక తెలుగులో సుమన్ ‘దర్జాదొంగ’  సినిమాతో సత్యరాజ్ విలన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత మరికొన్ని సినిమాల్లో నటించినా…  ‘బాహుబలి’ లోని కట్టప్ప పాత్ర తో  దేశవ్యాప్తంగా అలరించడంతో .. ఇప్పుడు సత్యరాజ్ .. చాలా బిజీ ఆర్టిస్ట్ గా మారియారు. నేడు సత్యరాజ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.

 

 

Leave a comment

error: Content is protected !!