కథకుడిగా కెరీర్ ప్రారంభించారు. సందపాదకుడిగా ఎదిగారు. డబ్బింగ్ సినిమాలతో సినీరంగ ప్రవేశం చేశారు. ఎన్నో సినిమాలను నిర్మించారు, దర్శకుడిగానూ సత్తా చాటుకున్నారు. కుటుంబ కథా చిత్రాలకు , యాక్షన్ మూవీస్ కు కేరాఫ్ అడ్రెస్ అయిన ఆయన పేరు విజయబాపినీడు. విజయ, విజయచిత్ర పత్రికలతో విజయ యాత్ర ప్రారంభించిన బాపినీడు.. దర్శకుడిగానూ సత్తా చాటుకొని విజయాల బాపినీడు అయ్యారు. ఏలూరు దగ్గరున్న చాటపర్రు గ్రామంలో జన్మించారు విజయబాపినీడు . ఆయన గణిత శాస్త్రంలో బి.ఎ డిగ్రీని ఏలూరు లోని సి.ఆర్.ఆర్ కళాశాలలో చేసారు. కొద్ది రోజులు వైద్య ఆరోగ్య శాఖలో పని చేశారు. బాపినీడు మొదటగా.. “అపరాధ పరిశోధన” అనే ఒక మాసపత్రికలో కథలు వ్రాసేవారు. ఇవి పాఠకులను విశేషంగా ఆకర్షించాయి. సినిమాల్లోకి రావడానికి పూర్వం ఆయన విజయ, బొమ్మరిల్లు, విజయచిత్ర పత్రికలకు సంపాదకునిగా పనిచేశారు.
1982లో చిరంజీవి ‘మగమహారాజు’ సినిమాతో దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయ్యారు బాపినీడు. తన సినీప్రస్థానంలో 22 సినిమాలకు దర్శకత్వం వహించిన బాపినీడు ఎక్కువగా చిరంజీవి (గ్యాంగ్‌లీడర్, ఖైదీ నం.786, బిగ్‌బాస్, మగధీరుడు, పట్నం వచ్చిన పతివ్రతలు, మహానగరంలో మాయగాడు), శోభన్ బాబు నటించిన చిత్రాలకు దర్శకత్వం వహించారు. నటుడు కృష్ణతో ‘కృష్ణ గారడీ’, మహారాజశ్రీ మాయగాడు, రాజేంద్ర ప్రసాద్‌తో వాలుజెడ తోలు బెల్టు, దొంగ కోళ్లు, సీతాపతి చలో తిరుపతి సినిమాలు తీశారు. 1998లో వచ్చిన ‘కొడుకులు’ బాపినీడు చివరి చిత్రం. రాజాచంద్ర, దుర్గా నాగేశ్వరరావు, జి.రామమోహనరావు, మౌళి, వల్లభనేని జనార్దన్లను దర్శకులుగా, భువనచంద్రను పాటల రచయితగా, కాశీ విశ్వనాథ్‌ను మాటల రచయితగా తెలుగు సినీ రంగానికి పరిచయం చేశారు విజయబాపినీడు. నేడు ఆయన జయంతి. ఈ సందర్భంగా ఆయనకి ఘననివాళులర్పిస్తోంది మూవీ వాల్యూమ్.