ముక్కు సూటి మనిషి. ఉన్నది ఉన్నట్టు మొహం మీద అనేసే మనస్తత్వం. తనకు నచ్చినది తాను చేసుకుపోయే నైజం. తప్పును తప్పు అని వేలెత్తి చూపించే ధైర్యం ఆయనది. బహుభాషా కోవిదుడు. మాటకారి, చమత్కారి, వ్యంగ్య బాణాల్ని సంధించడంలో నేర్పరి. అంతేకాదు… విజయా సంస్థ నెలకొల్పి చలన చిత్ర పరిశ్రమకే గర్వకారణంగా నిలిచిన పలు  చిత్రాలు నిర్మించిన విజయాధినేత. ఆయన పేరు చక్రపాణి. పేరు తగ్గట్టుగానే ఆయన చేతిలో విజయా సంస్థని విజయపథంలో నడిపించే చక్రం ఉండేది. అదే ఆయనకు తెలుగు ప్రజల్లో అంతటి ఖ్యాతిని తీసుకొచ్చింది. నాగిరెడ్డితో కలిసి విజయా సంస్థపై ఎన్నో అద్భుత చిత్రాలు తీసిన ఘనత ఆయనది.

చక్రపాణి గుంటూరు జిల్లా తెనాలిలో ఒక మధ్య తరగతి వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. జాతీయోద్యమ ప్రభావానికి లోనై ఉన్నత పాఠశాల విద్యకు స్వస్తిచెప్పి యలమంచిలి వెంకటప్పయ్య వద్ద హిందీ భాషను అభ్యసించారు. ‘చక్రపాణి’ అనే కలం పేరును ఈయనకు ఆయనే ప్రసాదించాడు. తరువాత స్వయంకృషితో సంస్కృతం, ఇంగ్లీషు భాషలలో గాఢ పరిచయాన్ని పొందారు. క్షయ వ్యాధిగ్రస్తుడై 1932 లో మదనపల్లె లోని శానిటోరియంలో వైద్యం కోసం వెళ్ళారు. అక్కడే కొన్ని నెలలు ఉండి, సాటి రోగి అయిన ఒక పండితుని సాయంతో బెంగాలీ భాష కూడా నేర్చుకొన్నారు. నేర్చుకొన్న తరువాత బెంగాలీ నవలలను తెలుగు లోకి అనువదించడం మొదలు పెట్టారు ముంబైలోని ఫేమస్ ఫిలింస్ వారి ‘ధర్మపత్ని’ కోసం ఈయన మాటలు రాశారు. బి.ఎన్.రెడ్డి రూపొందిస్తున్న స్వర్గసీమకు మాటలు వ్రాయడానికి చెన్నై వెళ్ళారు. ఆ టైమ్ లో  నాగిరెడ్డి, చక్రపాణి కలవడం, కలసి విజయా ప్రొడక్షన్స్  స్థాపించి, సినిమాలు తీయాలని నిర్ణయించడం జరిగింది. అప్పటి నుంచి వాహినీ స్టుడియోలో తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషలలో దాదాపు 35 చలనచిత్రాలను రూపొందించారు. ఇద్దరూ కలసి ‘షావుకారు, పాతాళ భైరవి, మాయాబజార్, గుండమ్మ కథ, మిస్సమ్మ, అప్పు చేసి పప్పు కూడు’ లాంటి అజరామరమైన సినిమాలు తీశారు. సినిమాలే కాక చక్రపాణి నాగిరెడ్డితో కలసి పిల్లల కోసం చందమామ కథల పుస్తకం ప్రారంభించారు. నేడు చక్రపాణి వర్ధంతి. ఈ సందర్భంగా ఆయనకి ఘన నివాళులర్పిస్తోంది మూవీ వాల్యూమ్.

 

 

 

Leave a comment

error: Content is protected !!