చక్రల్లాంటి కళ్ళు.. చంద్రబింబం లాంటి మోము.. అందమైన చిరునవ్వు.. ఆకట్టుకొనే రూపం.. వెరశి శ్రియా శరణ్. వయసు మీద పడుతున్నా వన్నె తరగని అందం ఆమెది. నాలుగు పదుల వయసుకు దగ్గరలో ఉన్న ఆ అందాల సుందరి.. నవతరం భామలకు ధీటుగా అవకాశాలు అందిపుచ్చుకోవడంలో ముందు వరుసలో ఉంటోంది. ఇప్పటికీ ఆ జోరు కొనసాగుతునే ఉంది.

ఉషాకిరణ్‌ మూవీస్‌ నిర్మించిన ‘ఇష్టం’తో తెరకు పరిచయమైంది శ్రియా శరణ్ . తొలి చిత్రంతోనే కుర్రకారు మనసు దోచుకొంది. ‘సంతోషం’ చిత్రంలో నాగార్జున సరసన నటించి విజయాన్ని సొంతం చేసుకొంది. ఇక అక్కడ్నుంచి ఆమె జైత్రయాత్ర కొనసాగుతూనే ఉంది. తెలుగుతో పాటు, మిగతా దక్షిణాది భాషలన్నింటిలోనూ నటించి పేరు తెచ్చుకొంది. హిందీ, ఇంగ్లిష్‌ చిత్రాల్లోనూ మెరిసింది. డెహ్రాడూన్‌లో జన్మించిన శ్రియ, హరిద్వార్‌లో పెరిగింది. ఈమె పూర్తి పేరు శ్రియశరణ్‌ భట్నాగర్‌.

చిన్నప్పట్నుంచే డ్యాన్స్ పై పట్టు పెంచుకొన్న శ్రియ కథక్, రాజస్థాన్‌ ఫోక్‌ డ్యాన్స్‌ నేర్చుకుంది. కాలేజీలో చదువుతున్నప్పుడే డ్యాన్స్‌ మాస్టర్‌ ప్రోత్సాహంతో ఓ మ్యూజిక్‌ వీడియోలో కనిపించే అవకాశం లభించింది. ఆ వీడియోనే ఆమెకి సినిమా అవకాశాలు తెచ్చిపెట్టింది. 2003లో ‘తుఝే మేరీ కసమ్‌’ చిత్రంతో హిందీలోకి అడుగుపెట్టింది. ఆ చిత్రం కూడా శ్రియకి మంచి పేరు తీసుకొచ్చింది. తెలుగులో ‘నువ్వే నువ్వే’తో పాటు, ‘ఠాగూర్‌’, ‘నీ మనసు నాకు తెలుసు’, ‘నేనున్నాను’, ‘అర్జున్‌’, ‘బాలు ఏబీసీడీఈఎఫ్‌జి’, ‘నా అల్లుడు’, ‘సదా మీ సేవలో’, ‘సోగ్గాడు’, ‘సుభాష్‌ చంద్రబోస్‌’, ‘మొగుడు పెళ్లాం ఓ దొంగోడు’, ‘ఛత్రపతి’, ‘భగీరథ’ ఇలా జయాపజయాలతో సంబంధం లేకుండా అవకాశాల్ని అందుకుంది శ్రియ. గత నాలుగేళ్లుగా ఆమె ‘మనం’, ‘గోపాల గోపాల’, ‘గౌతమీపుత్ర శాతకర్ణి’, ‘పైసావసూల్‌’ లాంటి  తెలుగు సినిమాల్లో  నటించి ప్రేక్షకుల్ని అలరించింది. నారా రోహిత్ తో  ‘వీరభోగ వసంతరాయలు’ లో  నటించింది. ‘ఎన్.టి.ఆర్: కథానాయకుడు’లో నాటి కథానాయిక ప్రభగా నటించింది. రష్యన్‌ బాయ్‌ఫ్రెండ్‌ ఆండ్రీ కొశ్చీవ్‌ని వివాహం చేసుకొన్న శ్రియ, ఆ తర్వాత కూడా సినిమా ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. తమిళంలో ‘నరగాసూరన్‌’, హిందీలో ‘తడ్కా’ చిత్రాల్లో నటించింది. నేడు శ్రియ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.

Leave a comment

error: Content is protected !!