ఆయన పాటలు వింటుంటే పండువెన్నెల్లో పిల్లతెమ్మర మనల్ని తాకినట్టుంటుంది. ఆ స్వరాలకు మనసు దూదిపింజెలా గాల్లో తేలుతుంది. ఆ రసరమ్యమైన రాగాలు, మృదు మధుర గీతాలు అందరి హృదయాల్ని ఆనంద డోలికల్లో తేలియాడిస్తాయి. ఆ సంగీత కారుడి పేరు సాలూరు రాజేశ్వరరావు. అందరూ ఆయన్ని రాసాలూరు రాజేస్వరరావు అని పిల్చుకుంటారు. పాటనుబట్టి వాద్యాల నిర్ణయం జరగాలే తప్ప వున్నాయి కదా వాద్యాలు వాడుకుందాం అనే భావన ఎప్పుడూ ఆయన దరిచేరనీయ లేదు. జానపద, సాంఘిక చిత్రాల పాటలకు ఎన్ని వాయిద్యాలు వుండాలి, పాశ్చాత్య ధోరణి పాటకైతే ఎన్ని వాయిద్యాలు వుండాలి అనే ఖచ్చితమైన లెక్కలు రాజేశ్వరరావు దగ్గర వుండేవి. జానపద పాటలకు ఫ్లూటు, డప్పులు, జముకు, డోలక్, క్లారినెట్, పంజా, షెహనాయి వంటి వాద్య పరికరాలను రాజేశ్వరరావు వాడేవారు.
‘మనసున మల్లెల మాలలూగెనో.. బృందావనమిది అందరిదీ, మధురం మధురం ఈ సమయం, పాడవేల రాధికా ప్రణయ సుధాగీతికా, వినిపించని రాగాలే కనిపించని అందాలే, మనసున మనసై బ్రతుకున బ్రతుకై, పాడమని నన్నడగవలెనా, ఎచటినుండి వీచెనో ఈ చల్లని గాలి, నీలగగన ఘనశ్యామా దేవా, చెలికాడు నిన్నే రమ్మని పిలువా, నీ చెలిమినేడే కోరితిని, నిన్న లేని అందమేదో నిదురలేచెనెందుకో, మోగింది కళ్యాణ వీణా, పచ్చబొట్టు చెరిగీపోదులే, మదిలో వీణలు మోగే, అభినందన మందాల మాల’.. ఇలా ఒకటా, రెండా… ఎన్నో అద్భుతమైన పాటల్ని కూర్చి.. తెలుగు వారికి కానుకగా ఇచ్చారు.
పాటలే కాదు, పౌరాణిక సినిమాలలో వుండే పద్యాలకు అద్భుతమైన బాణీలు కట్టి, తక్కువ ఆలాపనతో వాటిని హిట్ చేసిన ప్రతిభాశాలి రాజేశ్వరరావు. పద్యాలను ఘంటసాల, మాధవపెద్ది, పి.బి.శ్రీనివాస్‌ల చేత ఆలపింపజేసిన తీరుగొప్పగా వుంటుంది. నేడు సాలూరు రాజేశ్వరరావు జయంతి. ఈ సందర్బంగా ఆయనకు ఘననివాళులర్పిస్తోంది మూవీ వాల్యూమ్.