రంగస్థలం మీద ఎన్నో పాత్రలు ధరించి, ఆంధ్ర విశ్వవిద్యాలయం నాటకశాఖలో తర్ఫీదు పొంది రంగావఝుల రంగారావు సినిమాల్లో ప్రవేశించారు. తన వయసుకి మించిన పాత్రలూ, వయసుకి తక్కువ పాత్రలూ ధరించారు. బాపు, రమణల ‘సాక్షి’ మొదటి సినిమా కావడంతో, ఆ సినిమా పేరునే ఇంటిపేరుగా మార్చుకున్నారు. సినిమాల్లో నటిస్తూ నాటకాల్లో వేస్తూ సినిమా రంగంలో స్థిరపడ్డారు. ధరించే పాత్రమీద అమితమైన శ్రద్ధ. విషాదమైనా , వినోదమైనా అద్భుతంగా పలికించేవారు.
గుడివాడ దగ్గర కొండిపర్రు గ్రామం సాక్షిరంగారావు స్వస్థలం. తల్లిదండ్రులు రంగనాయకమ్మ, లక్ష్మినారాయణ. దాదాపు 800 సినిమాలలో నటించారు. బాపు, కె.విశ్వనాథ్, వంశీ తమ సినిమాలల్లో ఎక్కువగా తీసుకొనే వారు. రంగారావు కి ఇద్దరు కుమారులు ఒక్క కుమార్తె. ఈయన చిన్న కుమారుడు సాక్షి శివ కూడా నటుడే. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో స్టెనోగ్రాఫర్ గా పనిచేసేటప్పుడే ఆయన కిష్టమైన నాటకరంగంలో విరివిగా పాల్గొనేవాడు. మొదట్లో ఆర్తితో నిండిన పాత్రల్లో నటించినా, సిరివెన్నెల, స్వర్ణకమలం, ఏప్రిల్ 1 విడుదల, జోకర్ మొదలైన సినిమాల్లో చేసిన పాత్రలు ఆయన్ను హాస్యనటునిగా ప్రాముఖ్యం కల్పించాయి. ఆయన నటించిన చివరి సినిమా కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన స్వరాభిషేకం. నేడు సాక్షిరంగారావు జయంతి. ఈ సందర్భంగా ఆయనకి ఘన నివాళులర్పిస్తోంది మూవీ వాల్యూమ్.