ఆయనకి మాస్ పల్స్ మహబాగా తెలుసు. సుమోల్ని గాల్లోకి లేపించి.. హీరోల తొడకొట్టుడుతో హైఓల్టేజ్ పవర్ పుట్టించి అభిమానుల చేత విజిల్స్ వేయించడంలో ఆయన స్పెషలిస్ట్. యాక్షన్ తో పాటు అవసరం మేరకు కామెడీ తో నవ్వులు పూయించడం కూడా ఆయనకి మెగాఫోన్ తో పెట్టిన విద్య. ఆయన పేరు వి.వి.వినాయక్. స్టార్ హీరోలకి అమేజింగ్ ఇమేజ్ తెప్పించిన మాస్ డైరెక్టర్ ఆయన. అంతేకాదండోయ్… యంగ్ హీరోలకి కూడా కెరీర్ బెస్ట్ మూవీస్ ఇచ్చిన టాలెంటెడ్ డైరెక్టర్ కూడా.
‘ఆది’తో మెగాఫోన్ చేతపట్టిన వి.వి.వినాయక్ తన చిత్రాలతో సరికొత్త రికార్డుల్ని లిఖించారు. ‘దిల్’, ‘ఠాగూర్’.. ఇలా వరుసగా ఆయనకి విజయాలే. ‘సాంబ’ పర్వాలేదనిపించినా.. ‘బన్నీ’, ‘లక్ష్మీ’తో మళ్లీ బాక్సాఫీసుని షేక్ చేశాడు. ‘కృష్ణ’, ‘అదుర్స్’ చిత్రాలతో వినాయక్‌లోని మరో కోణం బయటికొచ్చింది. హాస్యానికి పెద్ద పీట వేస్తూ తెరకెక్కించిన ఆ సినిమాలతో వి.వి.వినాయక్ ఘన విజయాల్ని సొంతం చేసుకొన్నారు. ‘బద్రినాథ్’తో ఓ భారీ ప్రయత్నం చేసిన ఆయన ‘నాయక్’, ‘అల్లుడు శీను’ మూవీస్ తో తన మార్క్‌ని ప్రదర్శించారు. ‘ఖైదీ నంబర్ 150’తో మళ్లీ సత్తా చాటారు. అఖిల్ అక్కినేనిని కథానాయకుడిగా పరిచయం చేసింది వినాయకే. వినాయక్ అసలు పేరు గండ్రోతు వీర వెంకట వినాయక్. పశ్చిమ గోదావరి జిల్లా చాగల్లు ఆయన సొంతూరు. వి.వి.వినాయక్ తీసిన పలు చిత్రాలు ఇతర భాషల్లో రీమేక్ అయ్యాయి. కొన్ని అనువాదాలుగా విడుదలై ఘన విజయాల్ని సొంతం చేసుకొన్నాయి. తొలి చిత్రంతోనే ఉత్తమ తొలి చిత్ర దర్శకుడిగా నంది పురస్కారాన్ని అందుకొన్నారు. కమర్షియల్ దర్శకుడిగా పేరు తెచ్చుకొన్న వి.వి.వినాయక్ ఎప్పుడు సినిమా చేసినా ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోతుంటాయి. చిరంజీవి హీరోగా మలయాళ సినిమా ‘లూసిఫర్’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రానికి వినాయక్ దర్శకత్వం చేయనున్నారు. నేడు వి.వి.వినాయక్ పుట్టిన రోజు. ఈ
సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.