విశ్వవిఖ్యాత నటసార్వభౌమ డా. యన్టీఆర్ తన కెరీర్ లో ఎన్నో అద్భుతమైన జానపద చిత్రాల్లో నటించారు. అలాంటి వాటిలో చాలా ప్రత్యేకమైన సినిమా ‘భట్టి విక్రమార్క’. చందమామ కథల్లో విక్రమార్కుని సాహస గాథలు దాదాపు అందరూ చదివే ఉంటారు. అందులోని భట్టి, విక్రమార్క చక్రవర్తి పాత్రల్ని తీసుకొని.. సరికొత్త కథతో ‘భట్టి విక్రమార్క’ సినిమా గా మలిచారు. విక్రమార్కుని గా యన్టీఆర్ , భట్టిగా కాంతారావు, ప్రభావతీ దేవిగా అంజలీదేవి, తిరకాసుగా రేలంగి, ప్రచండుడుగా నాగభూషణం, ఇంద్రునిగా ముక్కామల, మాంత్రికుడు మంత్ర సిద్ధునిగా యస్వీఆర్ నటించారు. తూర్పుగోదావరి జిల్లా, రామచంద్రపురం దగ్గర దంగేరు జమీందారీ కుటుంబానికి చెందిన పోలిశెట్టి వీర వెంకట సత్య నారాయణ మూర్తి ఈ సినిమాని పి.వి.వి.ఎస్.ఎం. ప్రొడక్షన్స్ బ్యానరుపై నిర్మించి తన తల్లిదండ్రులైన పోలిశెట్టి వెంకటరత్నం నాయుడు, వెంకాయమ్మ దంపతులకు అంకితమిచ్చారు. ఈ సినిమా అప్పట్లో విజయవంతమై, శత దినోత్సవం కూడా జరుపుకుంది. జంపన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 1960, సెప్టెంబర్ 28న విడుదలైంది. సరిగ్గా 60 ఏళ్ళు పూర్తి చేసుకుంది ఈ సినిమా .‘భట్టి విక్రమార్క’ జానపద చిత్రం జోనర్ లోకి వచ్చినా.. దీనికి చందమామ కథలతో లింక్ ఉండడం వల్ల అప్పటి ప్రేక్షకులు.. దీన్ని ఓ చందమామ కథలాగానే ట్రీట్ చేశారు. అంతేకాదు .. విక్రమార్కుడుగా అభిమాన కథానాయకుడు యన్టీఆర్ నటించడం వల్ల ఈ సినిమా మరింతగా ప్రేక్షకుల ఆదరణను పొందింది.
విక్రమార్క చక్రవర్తి , మంత్రి భట్టి సహాయంతో ఉజ్జయినీ సామ్రాజ్యాన్ని పరిపాలి స్తూంటాడు. కాళికాదేవిని భక్తితో కొలిచి, ఆమె కటాక్షానికి పాత్రుడవుతాడు విక్రమార్కుడు. కాళికామాత ప్రత్యక్షమై అతడికి అజేయుడిగా వరాన్ని అనుగ్రహించి, ఒక వజ్ర ఖడ్గాన్ని బహూకరిస్తుంది. ఒక రోజు ఇంద్రుడు విక్రమార్కుణ్ణి స్వర్గానికి ఆహ్వానించి, రంభా ఊర్వశుల్లో ఎవరు ఉత్తమ నర్తకి అని ప్రశ్నిస్తాడు. విక్రమార్కుడు వారిద్దరి మెళ్లో దండలేసి నాట్యం చేయమంటాడు. ఇద్దరూ అద్భుతంగా నాట్యం చేస్తారు కానీ, రంభ ధరించిన దండలోని పువ్వులు వాడిపోతాయి. దాంతో ఊర్వశి ఉత్తమ నాట్యగత్తె అని విక్రమార్కుడు చెబుతాడు. అంతేకాదు ఊర్వశి భయపడకుండా నాట్యం చేయడం వల్లనే ఆమె దండలోని పువ్వులు వాడిపోలేదనే సత్యం చెబుతాడు. దాంతో సంతోషించిన ఇంద్రుడు విక్రమార్కుడికి 32 సాలభంజికలతో కూడిన సింహాసాన్ని బహూకరించి, దాంతో పాటు ఒక శక్తివంతమైన వజ్రాల మాలకూడా ఇస్తాడు. అంతేకాదు విక్రమార్కుడు ఆ సింహాసనం మీద వెయ్యి సంవత్సరాల పాలన చేస్తాడని చెబుతాడు. ఇంతలో భట్టి కూడా కాళికామాత అనుగ్రహం కోరుతూ .. ఆమె సంతృప్తి కోసం విక్రమార్కుడి శిరస్సు అర్పిస్తాడు. దాంతో సంతోషించిన కాళిక .. విక్రమార్కుడ్ని తిరిగి బతికించి.. భట్టికి 2వేల ఏళ్ళ ఆయుష్ణునిస్తుంది. భట్టి దానికి ఆనందించి.. విక్రమార్కునికి ఒక ఉపాయం చెబుతాడు. అతడ్ని సింహాసనం మీద ఒక ఆరునెలల కాలం పాటు కూర్చోమని .. ఇద్దరూ వెయ్యి సంవత్సరాల చొప్పున పాలన సాగిద్దామని చెబుతాడు. ఇక మాంత్రికుడు మంత్ర సిద్ధుడు ఎంటరవుతాడు. ఆ రాజ్య ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి విక్రమార్కున్ని ఓడించాలనే కసితో తిరుగుతుంటాడు. అలాగే.. విక్రమార్కుడు వెళ్ళాలనుకొన్న స్వయంవరంలోని రాకుమారిని అపహరించడానికి ప్రయత్నించి విఫలమవుతాడు. అయితే మొత్తం మీద ఎలాగైతేనేం.. ఒకసారి చంద్రసేన మహారాజు కుమార్తెను మంత్ర సిద్ధుడు అపహరిస్తాడు. చివరికి మాంత్రికుడిని సంహరించి ఆ రాకుమారిని విక్రమార్కుడు ఎలా రక్షిస్తాడు అన్నదే మిగతా కథ.