తెలుగు చలన చిత్ర చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే ఉత్తమ వినోదాత్మక సినిమా విజయా వారి మిస్సమ్మ. యల్ వీ ప్రసాద్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో యన్టీఆర్, ఏఎన్నార్, సావిత్రి నటించిన సంగతి తెలిసిందే. అయితే నిజానికి అందులో ముందుగా చక్రపాణి ఎంపికచేసుకున్న హీరోయిన్ భానుమతి అన్న సంగతి మీకు తెలుసా? ఆవిడ హీరోయిన్ గా మిస్సమ్మ షూటింగ్ ప్రారంభమైంది. నాలుగు రీళ్ళు కూడా పూర్తయ్యాయి. అందులో మేరీ పాత్ర ధారి అయిన భానుమతి ఒకరోజు వరలక్ష్మి వ్రతం కారణంగా షూటింగ్ కు చాలా ఆలస్యంగా వచ్చిందట. దాంతో నిర్మాతల్లో ఒకరైన చక్రపాణికి బాగా కోపం వచ్చి భానుమతిని క్షమాపణ చెప్పమన్నాడట. భానుమతి అందుకు అంగీకరించక ఇంటికి వెళ్ళిపోయారట. ఆ తర్వాత మరో నిర్మాత నాగిరెడ్డి ఆవిడకి ఫోన్ చేసి చక్రపాణి పట్టుదల మీకు తెలుసుకదా.. కనీసం ఫోన్ లో అయినా ..ఆయనకి సారీ చెప్పమని ఆవిడ్ని అడిగాడట. భానుమతి ఇంకా పట్టుదల గల మనిషి కాబట్టి.. దానికి నో అనేశారట. అలా.. భానుమతి స్థానంలో మిస్సమ్మలో సావిత్రి కథానాయిక అయిందట. ఆ సినిమా తెచ్చిపెట్టిన క్రేజ్ తో సావిత్రి ఆ తర్వాత ఎన్నో అవకాశాలు తెచ్చుకొని తెలుగు చిత్ర సీమలో మహానటి గా ఎదిగారు.