అద్భుతాలు ఎల్లవేళలా జరగవు. ఒక వేళ జరిగినా.. అవి నమ్మశక్యం కాని రీతిలో ఉంటాయి. యాదృచ్చికంగా జరిగినా.. అవి కలయా? నిజమా? అనే స్థాయిలో అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తాయి. అలాంటి ఓ అరుదైన అద్భుతం పుంభావ సరస్వతి వేటూరి.. గాన గంధర్వుడు బాలు విషయంలో జరిగింది.
ఎన్నో అద్భుతమైన పాటల్ని రచించి.. తెలుగు తెరను పులకింపచేసిన వేటూరి.. తన అమృతగానంతో భారతీయ ప్రేక్షకుల హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్న యస్.పీ. బాల సుబ్రహ్మణ్యం ఇద్దరికీ ఒకరంటే ఒకరికి చెప్పలేనంత ప్రేమా భిమానాలున్నాయి. వేటూరి పాటను పొగడకుండా బాలు ఉండలేరు.. బాలు గానాన్ని గగనానికి ఎత్తకుండా వేటూరి ఉండలేరు. ఆ ఇద్దరూ స్వర్గ సీమకు తరలి వెళ్ళిపోయారు. ఆ ఇద్దరూ మనల్ని వీడిపోయాకా.. తెలుగు పాట కన్నీరు పెట్టుకుంటోంది. తెలుగు సినీ సంగీతం .. భాష్పాంజలి ఘటిస్తోంది. అలాంటి మేథావులైన .. ఈ ఇద్దరి జీవిత విశేషాల్ని ఒక్కమారు పరిశీలిస్తే.. మనకు నమ్మశక్యం కాని ఒక విషయం తెలుస్తుంది.
వేటూరి సుందరరామ మూర్తి.. 1936 లో జన్మించి… 2010 లో మరణించారు. అంటే.. ఆయన 74 సంవత్సరాలు జీవించారు. 1974 లో ‘ఓ సీత కథ’ సినిమాతో గీత రచయితగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన దాదాపు మూడు దశాబ్దాల కాలం పాటు టాలీవుడ్ ను ఏలారు. అంతేకాదు .. ఆయన చనిపోయేంత వరకూ పాటలు రాస్తూనే ఉన్నారు.
అలాగే.. బాలు .. 1946 లో జన్మించి.. . 2020, లో మరణించారు. అంటే ఆయన కూడా సరిగ్గా 74 జీవించారు. 1966లో బాలు .. తెలుగు పరిశ్రమలో ప్లే బ్యాక్ సింగర్ గా తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించి.. దాదాపు 5 దశాబ్దాల కాలంపాటు తెలుగు తెరను ఏలారు. ఆయనకూడా చనిపోయేంత వరకూ పాటలు పాడుతునే ఉన్నారు.
సో… ఇలా బాలు, వేటూరి సరిగ్గా 74 ఏళ్ళపాటు ( 24,142 days ) .. ఈ తెలుగు నేలపై జీవించి.. మనల్ని తరింపచేయడం నిజంగా ఒక అద్భుతమే.