విశిష్ట నటుడు చంద్రమోహన్, సహజ నటి జయసుధ నటించిన సరదా ప్రేమకథా చిత్రం ‘పక్కింటి అమ్మాయి’. నాగార్జున ప్రొడక్షన్స్ బ్యానర్ పై, కె.సి.శేఖర్ బాబు సమర్పణలో కె.వాసు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. 1981 లో విడుదలైన ఈ కామెడీ సినిమా అప్పటి ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించింది. సింగర్ యస్పీ బాలసుబ్రహ్మణ్యం, సంగీత దర్శకుడు చక్రవర్తి ముఖ్యపాత్రలు పోషించిన ఈ సినిమాలో ఇంకా.. హేమసుందర్, చిడతల అప్పారావు, వీరభద్రరావు, ఝాన్సీ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు.
పక్కింట్లో ఉంటున్న జయసుధని చంద్రమోహన్ ఎంతగానో ఇష్టపడుతుంటాడు. కానీ జయసుధ లెక్కచేయదు. అయితే ఆమెకు సంగీతం అన్నా, డ్యాన్స్ అన్నా ప్రాణమని తెలుసుకుంటాడు. జయసుధకి సంగీతం నేర్పడానికి ఓ భాగవతార్ వస్తాడు. అతడికి కూడా ఆమె అంటే ఇష్టముంటుంది. ఎలాగైనా జయసుధ ఇంప్రెషన్ కొట్టేయాలని భావించిన చంద్రమోహన్.. తన స్నేహితుడు, నాటకాల రాయుడు, సింగర్ అయిన బాలరాజు సహాయం తీసుకొని .. అతడి ప్లే బ్యాక్ లో ఒక పాట పాడి.. తనే పాడుతున్నట్టు పెదవులు కదుపుతాడు. జయసుధ అతడి సింగింగ్ టాలెంట్ కు ముగ్ధురాలవుతుంది. ఆల్మోస్ అతడి ప్రేమలో పడిపోతుంది. అయితే ఒకసారి చంద్రమోహన్ జయసుధకి ఆ విషయంలో దొరికిపోతాడు. చంద్రమోహన్ ను జయసుధ చీకొట్టి వెళ్ళిపోతుంది. దాంతో అతడు విషం తాగినట్టు నాటకమాడి.. మళ్లీ ఆమె ప్రేమను పొందుతాడు. నిజానికి ఈ సినిమా కి మూలం 1952లో విడుదలైన ‘పాషర్ బారి’ బెంగాలీ సినిమా. అదే సినిమాను 1953లో రేలంగి, అంజలీదేవి జంటగా పక్కింటి అమ్మాయిగా రీమేక్ చేశారు. అప్పట్లో ఆ సినిమా కూడా బాగా ఆడింది. ఇప్పుడు అదే సినిమాను చంద్రమోహన్ , జయసుధతో రీమేక్ చేశారు. ఇక అదే బెంగాలీ సినిమా 1968 లో హిందీలో ‘పడోసన్’ గా రీమేక్ అయి అక్కడా హిట్ అయింది. అలాగే తమిళ, కన్నడలో సైతం ఈ సినిమా రీమేక్ అయింది.