నవరస నటనాసార్వభౌమ కైకాల సత్యనారాయణ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘దేవుడే దిగవస్తే’. సోషియో ఫాంటసీ మూవీగా తెరకెక్కిన ఈ సినిమాను గీతా ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై అల్లు రామలింగయ్య సమర్పణలో అల్లు అరవింద్, దాసరి సత్యనారాయణ మూర్తి నిర్మించారు. ఇక ఈ సినిమాను జనరంజకంగా మలిచిన దర్శకుడు దాసరి నారాయణరావు. 1975లో విడుదలైన ఈ సినిమా సరిగ్గా 45 ఏళ్ళు పూర్తి చేసుకుంది. రామకృష్ణ, సత్యనారాయణ, అల్లు రామలింగయ్య, గోకిన రామారావు, చంద్రమోహన్, లక్ష్మికాంత్, జయప్రద, జయమాలిని తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. ఇక ఇందులో రామకృష్ణ శ్రీకృష్ణుని పాత్రను పోషించారు.
కోటయ్య డబ్బే ప్రధానం అనుకొనే వ్యక్తి. నిజాయితీ పరుడు. కానీ దేవుడ్ని నమ్మడు. డబ్బుతో ఆ దేవుణ్ణే కొనేయొచ్చు అనుకొనే రకం. అలాంటి అతడు.. తన వ్యాపారంలో కోట్లు గడిస్తాడు. పెద్ద బంగ్లాలు, కార్లు కొనేసి విలాస వంతమైన జీవితం గడుపుతుంటాడు. కొద్దిరోజులకు అతడి ఇంట్లో మనశ్శాంతి కరువవుతుంది. ఆ డబ్బు వల్లే అన్ని చిక్కులొచ్చాయని తెలుసుకుంటాడు. వెంటనే కృష్ణా అంటూ దేవుడ్ని పిలుస్తాడు. కానీ దేవుడు రాడు. ఎందుకంటే.. ఆ దేవుడు అతడిలోనే ఉంటాడు. చివరికి కోటయ్య తన తప్పు తెలుసుకొని భక్తుడిగా ఎలా మారతాడు అన్నదే మిగతా కథ. అప్పట్లో ఈ సినిమా ఘన విజయం సాధించింది. తెలుగులో సోషియో ఫాంటసీ మూవీలకి మంచి ప్రేరణగా నిలిచింది ఈ సినిమా.