కొంతకాలంగా టాలీవుడ్ యాక్షన్ హీరో గోపీచంద్ కు కాలం కలసిరావడం లేదు. చేసిన  ప్రతీ సినిమా పరాజయం బాట పడుతోంది. కథను జడ్జ్ చేయడంలోనో, సరైన దర్శకుడ్ని ఎంచుకోవడంలోనో .. ఎక్కడో ఏదో పొరపాటు జరుగుతోంది. అందుకే ఇప్పుడు తన కెరీర్ కు రిపేర్లు ప్రారంభించాడు. అందులో భాగంగానే మనోడు ఇప్పుడు సంపత్ నందితో ‘సీటీమార్’ అనే ఒక స్పోర్ట్స్ డ్రామా ఎంచుకొని కొత్తగా ట్రై  చేస్తున్నాడు. ఇదిలా ఉంటే.. గోపీచంద్ తనకు మెంటార్ లాంటి తేజ దర్శకత్వంలో ఒక మూవీ చేయబోతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి.

గోపీచంద్ కెరీర్ బిగినింగ్ లో ‘జయం’ అనే మూవీతో అతడ్ని విలన్ ను చేసి కొత్త లైఫ్ ఇచ్చాడు తేజ. ఆ తర్వాత ‘నిజం’లో కూడా అతడిచేత భయంకరమైన విలన్ వేషం వేయించాడు. ఆ రెండు సినిమాలు గోపీచంద్ కెరీర్  మలుపు తిరగడానికి దోహదపడ్డాయి. ఇప్పుడు ఫ్లాప్స్ తో ఉన్న గోపీచంద్ కు మంచి హిట్టిచ్చే ప్రయత్నంలో ఉన్నాడు తేజ. అతడి కోసం ఒక బ్రహ్మాండమైన కథ రెడీ చేస్తున్నాడట . అతి త్వరలో ఈ సినిమా కు సంబంధించిన ప్రకటన రానుందని సమాచారం. అయితే రానా తో కూడా తేజ ఒక సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడు. కానీ రానా ఇప్పుడప్పుడే అందుబాటులో ఉండే అవకాశాలు లేవు కనుక.. గోపీచంద్ మూవీ ని ముందుగా పట్టాలెక్కిస్తాడట తేజ. ‘నేనే రాజు నేనే మంత్రి’  మూవీతో ఫామ్ లోకొచ్చిన తేజ అంతలోనే ‘సీత’ మూవీతో చతికిలపడ్డాడు. అందుకే గోపీచంద్ తో పాటు తనకు కూడా ఒక మంచి సక్సెస్ తెచ్చిపెట్టే ప్రయత్నంలో ఉన్నాడు తేజ.

Leave a comment

error: Content is protected !!