‘మహానటి’ ఘనవిజయం తర్వాత కీర్తి సురేశ్ రూట్ మార్చింది. మాస్ మసాలా కథల్ని, ప్రాధాన్యంలేని పాత్రల్ని అసలు దగ్గరకు రానీయడం లేదు. తెలుగులో అయితే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ కు మాత్రమే కమిట్ అవుతోంది. కానీ తమిళంలో మాత్రం అమ్మడు వచ్చిన ప్రతీ అవకాశాన్నీ సద్వినియోగం చేసుకుంటోంది. అలాగే.. తన రోల్ నచ్చితే.. యాక్షన్ మూవీస్ కు కూడా ఓకె చెబుతోంది. పనిలో పనిగా బాలీవుడ్ లోనూ తన టాలెంట్ ప్రదర్శించే పనిలోనూ బిజీగా ఉంది. ఇదిలా ఉంటే.. కీర్తి సురేశ్ కు తమిళంలో ఒక అరుదైన పాత్ర పోషించే అవకాశమొచ్చింది. ఒకప్పటి దక్షిణాది కథానాయిక అయిన తన తల్లి మేనక నటించిన ఒక సినిమాలోని అదే పాత్ర అమ్మడ్ని వరించింది.
సూపర్ స్టార్ రజనీకాంత్ కు స్టార్ డమ్ తెచ్చిపెట్టిన చిత్రాల్లో ‘నెట్రిక్కన్’ ఒకటి. తలైవా కెరీర్ బిగినింగ్ లో నటించిన ఈ తండ్రీ కొడుకుల కథ 1981 లో విడుదలై.. సూపర్ డూపర్ హిట్టైంది. అందులో మేనక కథానాయికగా నటించింది. అప్పట్లో తెలుగులో ఈ సినిమాను ‘ముసలోడికి దసరాపండుగ’ అనే పేరుతో డబ్బింగ్ చేశారు. అంతేకాదు.. ఇదే సినిమాను ఆ తర్వాత చాలా కాలానికి దాసరి.. రాజశేఖర్ తో ‘అహంకారి’గా తెలుగు లో రీమేక్ చేశారు. ఇప్పుడు అదే ‘నెట్రిక్కన్’ తమిళ మూవీని ధనుష్ రీమేక్ చేయబోతున్నట్టు ఆమధ్య డిక్లేర్ చేశాడు. తన మామగారి పాత్రను తాను చేయబోతునట్టు చెప్పాడు. ఇక ఈ మూవీలోనే మేనక చేసిన పాత్రను ఆమె కూతురు కీర్తి సురేశ్ చేయనుండడం ఆసక్తిగా మారింది. మరి మామ పాత్రను అల్లుడు, తల్లి పాత్రను కూతురు ఎంతలా నటించి మెప్పిస్తారో చూడాలి.