అందాల మోము.. ఆకట్టుకొనే రూపం… ఆకర్షించే కళ్ళు.. మైమరిపించే చూపులు.. ఆమె నవ్వితే ముత్యాలు దొర్లుతాయి.. మాట్లాడితే .. రతనాలు నాట్యమాడుతాయి. ఆమె పేరు మీనా. అందం, అభినయం కలగలిసిన జలతారు వీణ. ఒకప్పుడు దక్షిణాది ప్రేక్షకుల్ని తన అందంతో , అమాయకత్వంతో అలరించిన సుందరి.
మద్రాసు లో పుట్టి పెరిగిన మీనా తెలుగు, తమిళ, మలయాళం చిత్రాలతో మంచి పేరుతెచ్చుకొంది. తల్లి రాజమల్లిక కూడా అలనాటి తమిళ నటి. బాలనటిగా రజినీకాంత్, కమలహాసన్ లతో నటించి ఆ తరువాత వారి సరసనే కథానాయికగా నటించడం ఆమెకే చెల్లింది . ముత్తు, యజమాన్, వీరా, అవ్వై షణ్ముగి మంచి విజయాలు సాధించాయి. అలాగే తెలుగులోచిరంజీవి, బాలయ్య, నాగార్జున, వెంకటేశ్ లాంటి టాప్ స్టార్స్ తో రొమన్స్ పండించిన చిన్నది. ఈమె రజనీకాంత్ తో నటించిన సినిమాలు జపాన్లో కూడా విడుదలై మంచి క్రేజ్ రావడంతో ఈమెకు జపాన్లో కూడా ఫ్యాన్స్ ఏర్పడ్డారు. మీనా దాదాపు అన్ని దక్షిణ భారత భాషా సినిమాల్లో నటించింది. ఈమె తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్రరంగములలోని అగ్ర నాయకులందరితో కలిసి పనిచేసింది. దక్షిణాదిన క్రేజీ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత పెళ్ళి చేసుకొన్న ఆమె సినిమాలకు బ్రేకివ్వకుండానే… ఇంకా సీనియర్ హీరోల సరసన కథానాయికగా నటిస్తూనే ఉంది. నేడు మీనా పుట్టిన రోజు. ఈ సందర్బంగా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.