నటకిరీటి రాజేంద్రప్రసాద్ సినీ కెరీర్ లో చెప్పుకోదగ్గ ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్ టైనర్ ‘గాంధీనగర్ రెండవ వీధి’. సుశీల ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ పై.. పి.యన్.రామచంద్రరావు దర్శకత్వంలో జి.రెడ్డిశేఖర్, జె.గోపాల్ రెడ్డి, పి.పార్ధసారధి రెడ్డి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా 1987, జూలై 6న విడుదలైంది. ఇది కథానాయికగా గౌతమికి మొదటి సినిమా. చంద్రమోహన్, జయసుధ, శరత్ బాబు, రంగనాథ్, సుత్తి వీరభద్రరావు, మల్లికార్జునరావు, బాలాజీ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. ఇక ఒకప్పటి నేపథ్యగాయకుడు జి.ఆనంద్ ఈ సినిమాకు సంగీతం సమకూర్చడం విశేషం.
ప్రసాద్ ఓ మధ్యతరగతి కుటుంబీకుడు. తల్లి, చెల్లితో కలిసి ఒక ప్రాంతంలో నివసిస్తూ.. ఆర్ధిక ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ ఉంటాడు. ఇంతలో అతడి స్నేహితుడు ప్రభు .. తనకో ఉద్యోగం ఇప్పించమని ప్రసాద్ ను రోజూ పోరుతుంటాడు. అతడినుంచి ఎలా తప్పించుకోవాలో తెలియక సతమతమవుతోన్న అతడికి .. ఒక కాలనీలో దొంగల భయం ఎక్కువై.. వారికి ఒక గూర్ఖా అవసరమవుతాడు. దాంతో ప్రసాద్ .. ప్రభు నేపాల్ నుంచి వచ్చాడని .. అతడిని ఆ కాలనీకి గూర్ఖాగా నియమించే ఏర్పాట్లు చేస్తాడు. మరి తెలుగువాడైన ప్రభు.. అక్కడ నేపాలీ గూర్ఖాగా ఆ కోలనీవాళ్ళ మెప్పును పొందాడు? అలాగే.. అతడు ప్రేమించిన గీతను ఎలా పొందగలిగాడు? అన్నదే మిగతా కథ. నిజానికి ఈ సినిమా మలయాళంలో మోహన్ లాల్ హీరోగా నటించిన గాంధీనగర్ సెకండ్ స్ట్రీట్ సినిమాకి రీమేక్ వెర్షన్. సత్యన్ అంతిక్కడ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మలయాళీలను భలేగా ఎంటర్ టైన్ చేసింది. మంచి కథతో పాటు.. పుష్కలమైన కామెడీ, ఎమోషన్స్ సినిమాను జనానికి బాగా కనెక్ట్ అయ్యాయి.