చంద్రబింబం లాంటి గుండ్రటి మోము.. చక్రాల్లాంటి కళ్ళు.. చిరునవ్వు చిగురించే మోవి.. చిలిపిగా కవ్వించే మేని.. వెరశి ఖుష్బూ. దక్షిణాది తెరపై ఆమె ఒక అధ్యాయం. ప్రత్యేకించి తమిళ ప్రేక్షకులకు ఆమె ఆరాధ్య దేవత. ఆమెపై అభిమానాన్ని గుడి కట్టి మరీ చాటుకున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో దాదాపు 200 సినిమాల్లో నటించి మెప్పించిన ఖుష్బూ .. తెలుగు సినిమాతోనే కథానాయిక గా ప్రవేశించడం విశేషం.
ముంబైకి చెందిన ఒక ముస్లీమ్ కుటుంబంలో జన్మించిన ఖుష్బూ .. చిన్ననాటే చాలా హిందీ సినిమాల్లో అగ్ర కథానాయకుల సినిమాల్లో నటించింది. ది బర్నింగ్ ట్రైన్, నసీబ్, లావరీస్ , కాలియా, దర్ద్ కా రిస్తా, మేరీ జంగ్ , జానూ లాంటి సినిమాల్లో ఆమె మెరిసింది. అయితే కథానాయికగా దక్షిణాది చిత్రాలతోనే ప్రవేశించింది. వెంకటేశ్ హీరోగా తొలి చిత్రం ‘కలియుగ పాండవులు’లో కథానాయికగా ఖుష్బూ రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత కెప్టెన్ నాగార్జున, కిరాయి దాదా లాంటి సినిమాల్లో నాగ్ సరసన హీరోయిన్ గా మెప్పించింది. అయితే అప్పట్లో మరికొన్ని తెలుగు సినిమాల్లో మాత్రమే నటించిన ఖుష్బూ .. తమిళ సినిమాల్లో నటించి… అక్కడే అగ్రకథానాయికగా సెటిల్ అయిపోయింది. దాదాపు 100కు పైగానే సినిమాల్లో నటించి.. ఆరాధ్య కథానాయిక అయిపోయింది. అది ఆమెకు గుడికట్టి పూజించేవరకూ దారితీసింది. ఆమెకు ఎన్నో అవార్డులు వరించాయి. ఆపై రాజకీయాల్లోకి ప్రవేశించింది. నేడు ఖుష్బూ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.