నటభూషణ శోభన్ బాబు సినీ కెరీర్ కు గట్టి పునాదులు వేసిన సినిమా ‘కోడెనాగు’. కౌముది ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ పై యం.యస్.రెడ్డి నిర్మించిన ఈ సినిమాకి దర్శకుడు కె.యస్.ప్రకాశరావు. 1974లో విడులైన ఈ సినిమా ఘన విజయం సాధించింది. లక్ష్మీ , చంద్రకళ కథానాయికలు నటించిన ఈ సినిమాలో ఇంకా ధూళిపాళ, ముక్కామల, చంద్రమోహన్, రావుగోపాలరావు, రాజబాబు, సూర్యాకాంతం, నిర్మలమ్మ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. అయితే ప్రముఖ గీత రచయిత ఆత్రేయ ఇందులో ఓ కీలకమైన పాత్రను పూర్తి స్థాయిలో పోషించి మెప్పించారు. పెండ్యాల వారి సంగీతంలోని పాటలు ఇప్పటికీ ఎంతో ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా సంగమం సంగమం, నాగపాము పగ పాటలు ఎవర్ గ్రీన్ హిట్స్ .
నాగరాజు దుండుడుకు స్వభావి. చిన్నప్పటి నుంచి అతడికి కోపమెక్కువ. తను అనుకున్నదే జరగాలన్న పట్టుదల. అతడు దైవం కన్నా ఎక్కువని భావించే స్కూల్ మాస్టార్ నాగరాజు కోపాన్ని కంట్రోల్ లో పెడుతుంటాడు. అలాంటి నాగరాజు ఒక క్రైస్తవ అమ్మాయి ప్రేమలో పడతాడు. వారి ప్రేమకు పెద్దలు అంగీకరించరు. దాంతో నాగరాజు .. ఆ అమ్మాయితో కలిపి చివరకు ఆత్మహత్య చేసుకుంటాడు. నిజానికి ఈ సినిమా కన్నడ సూపర్ హిట్టు మూవీ ‘నాగరహావు’ కి రీమేక్ వెర్షన్. ఈ సినిమాతోనే విష్ణువర్ధన్ కన్నడ చిత్రాల్లో హీరోగా ప్రవేశించాడు.