విలక్షణ నటుడు మోహన్ బాబు ..విలన్ పాత్రలతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చినా.. ‘కేటుగాడు’ చిత్రంతో మొట్ట మొదటిసారిగా హీరో అయ్యారు. ఆ సినిమాలోని ఆయన పాత్రకు మంచి పేరు రావడంతో పాటు .. సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్టయింది. అక్కడ నుంచి మోహన్ బాబు హీరోగా పలు విజయవంతమైన చిత్రాల్లో నటించారు. ఆ తర్వాత కొంత కాలానికి మళ్లీ విలన్ పాత్రలు వేయడం మొదలు పెట్టారు. అయితే ‘అల్లుడు గారు’ చిత్రంతో మోహన్ బాబు మళ్లీ హీరోగా చేయడంమొదలు పెట్టారు.1990 లో విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ . కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో శోభన కథానాయికగా నటించింది. అతిథి పాత్రలో రమ్యకృష్ణ నటించింది. కె.వి.మహాదేవన్ సంగీతం అందించిన ఈ సినిమాలో పాటలన్నీ అప్పటి ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించాయి. నిజానికి ఈ సినిమా 1988 లో మలయాళంలో వచ్చిన ‘చిత్రం’ సినిమాకి రీమేక్. మోహన్ లాల్, రంజని జంటగా నటించిన ఈ సినిమా ఆ ఏడాది మలయాళంలో వచ్చిన చిత్రాలన్నిటినీ బీటవుట్ చేసి దాదాపు 300 రోజులకు పైగానే ఆడింది. ప్రియదర్శన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ మోహన్ లాల్ బెస్ట్ మూవీస్ లో ఒకటిగా నిలిచిపోయింది.