నటసామ్రాట్ డా. అక్కినేని నాగేశ్వరరావు నటించిన ద్విపాత్రాభినయ చిత్రాల్లో .. అద్భుతమైన ఫ్యామీలీ డ్రామా ‘పిల్ల జమీందార్’. జయసుధ కథానాయికగా నటించిన ఈ సినిమాలో ఇంకా మోహన్ బాబు, దీప, రమాప్రభ, రాజబాబు, ప్రభాకరరెడ్డి, త్యాగరాజు, ధూళిపాళ, పి.యల్.నారాయణ , అత్తిలి లక్ష్మి తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. 1980లో విడదులైన ఈ సినిమాకి దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు. సరిగ్గా 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా అప్పట్లో ఘన విజయం సాధించింది.
మధు మెకానిక్. అతడు పూర్వాశ్రమంలో ఒక ధనికుల బిడ్డ. శంకరయ్య, అతడి స్నేహితుడు, శ్రీహరి మధు తల్లిదండ్రుల్ని ఒక యాక్సిడెంట్ లో చంపేస్తారు. శంకరయ్య ఆ బిడ్డను పెంచుకుంటాడు. అయితే.. ధనవంతుడైన బాలరాజు వారసుడిగా.. శ్రీహరి తన కొడుకును ప్రవేశపెట్టి ఆస్తి కాజేయాలని చూస్తాడు. అప్పుడు మధు, బాలరాజు కలిసి ఒక డ్రామా ఆడి శ్రీహరి, అతడి కొడుకు ఆట కట్టించడమే మిగతా కథ. అక్కినేని తాత, మనవడుగా ద్విపాత్రాభినయం చేశారు. చక్రవర్తి సంగీత సారధ్యంలోని పాటలు ఇప్పటికీ ఆకట్టుకుంటూ ఉంటాయి. ఈ సినిమాతోనే గీత రచయిత వడ్డేపల్లి కృష్ణ పరిచయం అయ్యారు. నీనవ్వులోనా విరజాజి వాన, గేర్ మార్చు , వయసేమో ఇరవై లాంటి పాటల్ని ఆయనే రాశారు.