అందమైన ముఖం…. ఆకర్షించే చూపులు.. విల్లులా వంగే ఒళ్ళు .. నిషా కళ్ళ వాకిళ్ళు.. వెరశి సిల్క్ స్మిత. మత్తెక్కించే నాట్యాలకి, ముద్దులొలికించే మాటలకి ఆమె చిరునామా. తెలుగు, తమిళం, కన్నడం, మళయాళం, హిందీ భాషలలో 200పైగా సినిమాలలో నటించింది. ఈమె అధికంగా గ్లామర్‌తో కూడిన పాత్రలు పోషించింది.
సిల్క్ స్మిత అసలు పేరు విజయలక్ష్మి. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు సమీపంలో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించింది. సినీనటి కావాలనే ఆకాంక్షతో మద్రాసులోని తన అత్త ఇంటికి చేరింది. స్మిత అని తెరపేరు ధరించింది. ఆమె మొదటి సినిమా తమిళంలో ‘వండి చక్రం’ (బండి చక్రం). 1979 లో విడుదలైన ఈ చిత్రంలో ఆమె పాత్ర పేరు సిల్క్. దానికి మంచి పేరు రావడంతో .. ఆమె తన పేరును సిల్క్ స్మిత గా మార్చుకుంది. క్రమంగా ఆమె సినీరంగంలో ప్రముఖనటిగా నిలదొక్కుకుంది. అనేక సినిమాలలో ఆమె ప్రత్యేక గీతాలు, శృంగార నృత్యాలు అమెకు మంచి క్రేజ్ తెచ్చి పెట్టాయి. అయితే సీతాకోక చిలుక, అభిమన్యుడు, వసంతకోకిల, లాంటి కొన్ని చిత్రాలలో నటనాప్రధానమైన పాత్రలలోను మెప్పించింది. అలాగే.. మాయలాడి, వీర విహారం, పులిదెబ్బ లాంటి సినిమాల్లో యాక్షన్ ప్రధాన పాత్రల్లో మెప్పించింది. “లయనం” అనే అడల్టరీ మూవీ ఆమెకు చాలా పేరును తెచ్చింది. సిల్క్ స్మిత తన జీవితాంతం అవివాహిత గానే ఉంది. కొన్ని సినిమాల్ని నిర్మించింది. నేడు సిల్క్ స్మిత వర్ధంతి. ఈ సందర్భంగా ఆమెకు ఘననివాళులర్పిస్తోంది మూవీ వాల్యూమ్.