ఆమె లో ఆకర్షించే అందముంది, ఆకట్టుకొనే అభినయముంది. ఆ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ .. సౌత్ లో నెగ్గుకురావడమే ఆమె టాలెంట్. గ్లామర్ పాత్రలకు ససేమిరా అంటుంది. ఛాలెంజింగ్ పాత్రలు చేయడంలో తనకు తానే సాటి అనిపించుకుంటుంది. ఆమె పేరు నిత్యామీనన్. పేరు కు తగ్గట్టుగానే ఆమె ఎప్పటికప్పుడు నిత్యనూతన పాత్రలతో ప్రేక్షకుల్ని మెప్పిస్తూ ఉంటుంది. హైట్ కాస్త తక్కువేమో గానీ.. దర్శక,నిర్మాతలు సౌత్ లో ఆమెకిచ్చే వెయిట్ కేమీ తక్కువ లేదు. వైవిధ్యమైన పాత్రపోషణలో సౌత్ మేకర్స్ కు ఎప్పుడూ ఆమె ఒక ఆప్షన్.
మలయాళ కుటుంబానికి చెందిన నిత్య బెంగుళూరులో జన్మించింది. మణిపాల్ విద్యాసంస్థల్లో పాత్రికేయ విద్యని అభ్యసించింది. నటిని అవుతానని ఎప్పుడూ అనుకోలేదట ఆమె. అందుకే జర్నలిజంలో చేరింది. కానీ ఆ తరువాత మనసు మార్చుకొని తనకి ఇష్టమైన ఫొటోగ్రఫీవైపు వెళ్లాలనుకొంది. ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌టిఐఐ)లో సినిమాటోగ్రఫీ కోర్సు చేయాలనుకొంటున్న కమ్రంలోనే దర్శకురాలు నందిని రెడ్డి పరిచయమైంది. ఆమె ప్రోద్బలంతోనే కథానాయికగా ‘అలా మొదలైంది’తో తెలుగు తెరకు పరిచయమైంది నిత్య. అంతకుముందు కొన్ని కన్నడం, మలయాళం చిత్రాల్లో బాలనటిగానూ, కీలక పాత్రల్లోనే నటించిన అనుభవం ఉంది నిత్యకి. అయితే పూర్తిస్థాయిలో చేసిన తొలి చిత్రం మాత్రం ‘అలా మొదలైంది’. అది ఘన విజయం సాధించడంతో నిత్య పేరు మార్మోగిపోయింది. అందులో నటించడంతోపాటు, రెండు పాటలు కూడా పాడింది నిత్య. అప్పట్నుంచి ఒక భాషతో సంబంధం లేకుండా దక్షిణాదిలోని నాలుగు భాషల్లో నటిస్తూ వచ్చింది నిత్య. తెలుగులో ‘ఇష్క్’, ‘గుండెజారి గల్లంతయ్యిందే’, ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘రుద్రమదేవి’ తదితర చిత్రాల్లో నటించి విజయాలు అందుకుంది నిత్య. ‘24’, ‘జనతా గ్యారేజ్’, ‘అ’, ‘గీత గోవిందం’లో పాత్రలు కూడా నిత్యకి మంచి పేరు తీసుకొచ్చాయి. ‘ప్రాణ’తో హిందీలోకి అడుగుపెట్టిన ఆమె, అక్కడే ‘మిషన్ మంగళ్’ అనే చిత్రంలోను నటించింది. నేడు నిత్యా మీనన్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆ అందాల భామకు శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.
హ్యాపీ బర్త్ డే నిత్యామీనన్.